- 16 నెలలుగా నిలిచిపోయిన నిక్షయ్ పోషణ్ నిధులు
- ఆర్థిక సాయం అందక... ఇబ్బందులు పడుతున్న పేషంట్లు
- గతేడాది 79 వేలు, ఈ ఏడాది 47 వేల మందికి అందని సాయం
- టీబీ పేషెంట్లకు పోషకాహారం కోసం ప్రతినెలా రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సాయం
- కేంద్రానికి లెటర్లు రాయడానికే పరిమితం అవుతున్న ఆరోగ్య శాఖ అధికారులు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సాయం అందడం లేదు. నెలకు రూ.1000 చొప్పున అందాల్సిన నిక్షయ్ పోషణ్ నిధులు ఏకంగా 16 నెలలుగా అందక.. ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ప్రాణాంతక వ్యాధి శరీరాన్ని కుంగదీస్తుంటే.. మరోవైపు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందక.. వేలాది మంది పేద రోగులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.
నిక్షయ్ పోషణ యోజన పథకం కింద అందే ఆర్థిక సాయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాలి. అయితే గతేడాదిన్నరగా కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో.. రాష్ట్ర వాటా కూడా నిలిచిపోయింది. దీంతో టీబీ పేషంట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
సాయం కోసం ఎదురుచూపు..
టీబీ మందులు చాలా పవర్ ఫుల్. ఈ మందులు వేసుకునే రోగులు కచ్చితంగా గుడ్లు, పాలు, పప్పు ధాన్యాల వంటి బలమైన ఆహారం తీసుకోవాలి. ఖాళీ కడుపుతో మందులు మింగితే వాంతులు, కళ్లు తిరగడం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. ఈ భయంతో చాలా మంది రోగులు మధ్యలోనే చికిత్స ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేద రోగులకు ఆసరాగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం 2018లో నిక్షయ్ పోషణ పథకాన్ని తెచ్చింది.
తొలుత నెలకు రూ. 500 అందించగా, 2024లో దానిని రూ. 1,000కి పెంచారు. నిధుల శాతం అయితే పెంచారు. కానీ, నిధుల విడుదలలో జాప్యం చేసుకుంటూ వస్తున్నారు. రూల్స్ ప్రకారం.. టీబీ పేషంట్ పేరు నమోదు కాగానే ఆర్థిక సాయం ప్రతి నెలా నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలి. ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లకే ఈ సాయం వెళ్తుంది. అకౌంట్లలో ఆర్థికసాయం ఎప్పుడు పడుతుందా.. అని టీబీ పేషంట్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉన్నది.
ఏటికేడు తగ్గుతున్న సాయం..
రాష్ట్రంలో టీబీ పేషంట్లకు అందుస్తున్న ఆర్థిక సాయం కూడా ఏటికేడు తగ్గుతూ వస్తున్నది. ఏటా నమోదవుతున్న కేసులకు, సాయం అందుతున్న రోగులకు అస్సలు పొంతన ఉండటం లేదు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2023లో రాష్ట్రంలో 74,994 కేసులు నమోదు కాగా.. 47,728 మందికే సాయం అందింది. 2024లో 76,611 కేసులు నమోదు కాగా.. లబ్ధిదారుల సంఖ్య 37,350కి పడిపోయింది. 2025లో 79,738 కేసులు నమోదవగా.. కేవలం 3,161 మందికి మాత్రమే సాయం అందడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 47 వేల మందికి పైగా రోగులు నమోదైనా, ఒక్కరికి కూడా పైసా అందలేదు. అయితే, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో టీబీ పేషంట్లకు ఆర్థిక సాయం మన రాష్ట్రంతో పోలిస్తే మెరుగ్గానే అందుతున్నది. అక్కడి ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబడుతున్నాయి. కానీ మన రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులు మాత్రం కేవలం ఉత్తరాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆదుకుంటున్న నిక్షయ్ మిత్రలు
ప్రభుత్వం చేతులెత్తేసినా.. సమాజంలోని దాతలు నిక్షయ్ మిత్రలుగా మారి టీబీ రోగులకు అండగా నిలుస్తున్నారు. ఈ ఏడాది ఎన్జీవోలు, వ్యక్తులు సీఎస్ఆర్ రూపంలో.. టీబీ పేషంట్లకు చేయూతనిచ్చేందుకు మొత్తం 4,259 మంది దాతలు ముందుకు రావడం విశేషం. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 47 వేలకు పైగా కేసులు నమోదు కాగా అందులో 26,786 మంది రోగులను దాతలు దత్తత తీసుకున్నారు.
వీరికి పౌష్టికాహార కిట్లు అందిస్తూ, చికిత్స పరంగా భరోసా కల్పిస్తున్నారు. టీబీ నిర్మూలనలో తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇందులో సంస్థల కంటే సామాన్య వ్యక్తులే రెండు వేలకు పైగా మంది ఉండటం విశేషం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. నెలలుగా పేరుకు పోయిన బకాయిలను విడుదల చేయాలని టీబీ రోగులు అధికారులను కోరుతున్నారు.

